ఐదేళ్లలో ఏపీలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 150 కంపెనీల ద్వారా 50 వేల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. అనేక సదస్సులు ఏర్పాటు చేసి విశాఖపై దృష్టి పెట్టామని..భూములు కేటాయించి పరిశ్రమలకు శంకుస్థాపనలు చేశామని తెలిపారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీని తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా ఆగిపోయిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను పలు కంపెనీలను కలిశానని... గత ప్రభుత్వంలో వాటాలు అడిగారని వారు చెప్పారని లోకేశ్ తెలిపారు. ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇలా అయితే రాష్ట్రానికి కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు చొరవ కారణంగా ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువాళ్లు కనిపిస్తున్నారని..ఇది మనకు గర్వకారణమని అన్నారు.
Share