ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును మోదీకి అందజేసింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో భాగంగా గయానా చేరుకున్నారు. గయానాలో జరిగిన ఇండియా-కారికోమ్ సమ్మిట్ సదర్భంగా డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ప్రధాని మోదీని కలిసి ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’తో సత్కరించారు. కొవిడ్ -19 సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ ఆ దేశానికి అందించిన మద్దతు, భారత్ – డొమినికా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ చేసిన కృషికిగాను డొమినికా అత్యున్నత పురష్కారంతో సత్కరించారు.గత కొన్నేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు పట్ల ప్రపంచ దేశాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయా దేశాలకు భారతదేశం అందిస్తున్న సహాయాన్ని దృష్టిలో ఉంచుకొని పలు దేశాలు ఆ దేశాల అత్యున్నత స్థాయి పురస్కారాలతో ప్రధాని మోదీని గౌరవిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో డొమినికా కూడా చేరింది. దీంతో ప్రధాని అందుకున్న మొత్తం అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 19కి చేరుకుంది.
Share