కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ విధానం మహిళల మెడకు ఉరితాడు వంటిదని మహిళా సంఘాల ఐక్యవేదిక కన్వినర్ ఎం.లక్ష్మి అన్నారు. రాష్ట ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి ప్రవేశ పెడుతున్న నూతన మద్యం పాలసీ విధానానికి వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్నంగా మహిళలు ఉరితాళ్లు మెడకు వేసుకొని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మద్యాన్ని ప్రభుత్వాలు ఆర్థిక వనరులుగా చూస్తున్నాయని, మద్యం పాలసీని సమూలంగా నివారించాలని డిమాండ్ చేశారు. మద్యం వలన మహిళలు, చిన్నారుల పట్ల దాడులు పెరిగిపోతున్నాయని, కుటుంబాల అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.