Current Date: 28 Sep, 2024

ఉత్తరాంధ్ర వరదలపై హోంమంత్రి సమీక్ష

ఉత్తరాంధ్రలో సంభవించిన వరదలపై విశాఖ కలెక్టరేట్‌లో మంగళవారం ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో ప్రభుత్వ ప్రాధాన్యాంశాలపై ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. పంటనష్టం, గూడు కోల్పోయిన బాధితుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ కలెక్టర్‌ ఎంఎన్‌ హరీంధర ప్రసాద్‌, జేసీ కె.మయూర్‌ అశోక్‌ ఆమెకు పుష్పగుచ్ఛాలందజేసి సాదర స్వాగతం పలికారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల తలెత్తిన నష్టాలు, చేపట్టిన సహాయక చర్యలపై విశాఖ, అనకాపల్లి, మన్యం, విజయనగరం, ఏఎస్‌ఆర్‌ జిల్లాల కలెక్టర్లతో కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి అనిత వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచి కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బగ్చీ, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. కె.ఫక్కీరప్ప, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌ కుమార్‌తో పాటు ఆర్డీవోలు డి.హుస్సేన్‌ సాహెబ్‌, పి.భాస్కరరెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, జీవీఎంసీ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, మత్స్య, వ్యవసాయ, ఉద్యానవన, నీటి పారుదల, ఈపీడీసీఎల్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, అగ్నిమాపక, ఉప రవాణా తదితర శాఖల అధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Share