Current Date: 26 Nov, 2024

విశాఖ సెంట్రల్‌ జైల్‌ వద్ద రౌడీషీటర్‌ హల్‌చల్‌

విశాఖలో రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. రిమాండ్‌ ఖైదీగా ఉంటున్నా వారిలో మార్పు రావడం లేదు. అడ్డొచ్చిన వారిపై జులుం ప్రదర్శిస్తున్నారు. తనకు గౌరవం ఇవ్వలేదని, మర్యాదగా ప్రవర్తించాలంటూ ఓ రౌడీషీటర్‌ సాక్ష్యాత్తూ విశాఖ సెంట్రల్‌ జైలు వద్ద ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌) సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలు కేసుల్లో రిమాండ్‌లో ఉన్న గుర్రాల సాయి (34)ని విచారణ నిమిత్తం సోమవారం కోర్టుకు తీసుకు వెళ్లారు. అనంతరం సెంట్రల్‌ జైలుకు తీసుకు వచ్చిన సిబ్బంది పట్ల సాయి దురుసుగా ప్రవర్తించాడు. తన చేయి వదలాలని, తాను చెప్పింది వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ యూనిఫాంలో ఉన్న వారిని తీవ్ర పదజాలంతో దూషించాడు. మరో కానిస్టేబుల్‌ ఈ దృశ్యాల్ని వీడియో తీస్తుండగా తన వద్ద పోలీసులు రూ.20వేలు లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ, వీడియో తీయోద్దని గదమాయించాడు. అంతేకాకుండా సిబ్బందిని బూతులు తిడుతూ హల్‌చల్‌ చేశాడు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సాయి అంతలా రెచ్చిపోతున్నా ఏమీ చేయలేని స్థితిలో పోలీసులు మిన్నకుండిపోయారు. ఫిర్యాదిస్తే కేసు నమోదు చేస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.

Share