ఏపీ శాసన సభలో సంఖ్యా బలం లేనందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కు లేఖ వ్రాయటం విడ్డురంగా ఉందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు ఆక్షేపించారు. గురువారం అనకాపల్లి పట్టణంలోని డివిఆర్ కార్యాలయంలో దాడి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చట్ట సభల్లో ఆన వాయితీలకు, సభాపతి ఇచ్చే రూలింగులకు, సభా నియమాలతో సమానంగా ప్రాధాన్యత ఉంటుందని దాడి పేర్కొన్నారు. మొట్టమొదటి లోక్ సభ స్పీకర్ దాదా సాహెబ్ జి.వి. మవలంకర్ 1952లో ప్రతిపక్ష నాయకుని గుర్తింపునకు నిబంధనలు ప్రకటించారని దాడి తెలిపారు. అధికార పార్టీ తరువాత అత్యధిక సంఖ్య ఉన్న ప్రతి పక్ష పార్టీకి అధికారిక హోదా ఇవ్వాలని,అది కూడ మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతానికి తక్కువ కాకుండా సభ్యులుండాలనే విధాన నిర్ణయాన్ని అమలుచేశారని దాడి చెప్పారు. అప్పటి నుంచి 72 సంవత్సరాలుగా పార్లమెంటు ఉభయ సభల్లో ను, దేశంలోని అన్ని రాష్ట్ర శాసనసభలు, మండళ్ల లోను ఇదే విధానం కొనసాగు తుందన్న విషయం తెలియనట్టు జగన్ నటించడం విచారకరమని దాడి అన్నారు.
Share