కాకినాడ జిల్లాలో ఎన్నికలు రోజురోజుకీ రంజుగా మారనున్నాయి. జనసేన కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న తంగేల ఉదయ్ శ్రీనివాస్ తన నామినేషన్‌లో పొందుపరిచిన అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. రాజకీయాలలోకి వచ్చే సమయంలో తన గురించి తాను చేసుకొన్న ఆర్భాటపు ప్రచారమే ఇపుడు ఆయనకు శాపంగా మారబోతోంది.
టీ టైమ్ శ్రీనివాస్‌గా పేరొందిన తంగెల ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ పత్రంలో ఆయన ఇంటర్ చదివినట్లు రాసుకొచ్చారు. కానీ.. గతంలో తాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ చేసినట్లు ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు దుబాయ్‌లో తాను సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్‌గా ఉద్యోగం చేశానని గతంలో చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల అఫిడవిట్ లో తన విద్యా అర్హత ఇంటర్ అని నమోదు చేయడంతో ఇపుడు అసలు వివాదం మొదలైంది.
దుబాయ్ లో తంగెల ఉదయ్ శ్రీనివాస్ సాఫ్ట్ వేర్ జాబ్ చేయలేదని క్రికెట్ బుకీ నిర్వహించేవాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన తంగెల ఉదయ్ శ్రీనివాస్‌పై దుబాయ్ ప్రభుత్వం 2015 మార్చిలో కేసు నమోదు చేసి, లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంతో జనసేన సమర్థించలేక.. ఊరుకోలేక ఆత్మరక్షణలో పడిపోయింది. మరోవైపు వైసీపీ ప్రధాన అస్త్రం దొరికినట్లయ్యింది.