ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ఆగస్టు 2 కల్లా ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలకు సంబంధించి పిటిషన్‌పై ఈరోజు సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ అభయ్ ఒకా ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది. తదుపరి విచారణను ఆగస్టు 2కు ఉన్నతన్యాయస్థానం వాయిదా వేసింది. ఏపీలో ప్రభుత్వం మారిందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హుజెఫా అహ్మదీ... సుప్రీంకోర్టుకు తెలిపారు. గత అధికారులు ఇసుక తవ్వకాల్లో పెద్దగా ఉల్లంఘనలు జరగలేదని నివేదిక ఇచ్చారన్నారు. అదే సమయంలో మీడియాలో అందుకు విరుద్ధంగా ప్రసారాలు వచ్చాయని.. అందువల్ల రెండిటినీ పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సమయం కోరిందని కోర్టుకు తెలిపారు. నివేదికతో పాటు ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.