తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలిని రక్త సంబంధీకులు స్మశానానికి తరలించిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కూకట్ల రాజవ్వ(60) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. వారికి పిల్లలు లేరు. ఆమె పద్మానగర్ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది.కిడ్నీలు పాడవడంతో తంగళ్లపల్లిలోని తన సోదరుడి కుమారుడైన తిరుపతి ఇంటికి కొద్ది రోజుల కిందట వెళ్లి అక్కడే ఉంటోంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు తెలుసుకున్న బస్వాపూర్, మండెపల్లికి చెందిన రాజవ్వ అక్కాచెల్లెళ్లు భూమవ్వ, ఎల్లవ్వలు ఆమెను చూసేందుకు తంగళ్లపల్లి వచ్చారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.రెండు రోజులు చికిత్స అందించిన తర్వాత ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో సోమవారం రాజవ్వను తంగళ్లపల్లిలోని తిరుపతి ఇంటికి తీసుకెళ్లారు. మీ ఇంటికి తీసుకుపోతామని చెప్పి మళ్లీ ఇక్కడికే తీసుకొచ్చారేంటని తిరుపతి ప్రశ్నించగా వారి మధ్య గొడవ జరిగింది.
Share