Current Date: 08 Feb, 2026

ప్రియుడి కోసం పేరెంట్స్‌ను చంపిన నర్సు.. నమ్మించి ఇంజక్షన్!

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో ప్రేమ వివాహానికి అడ్డుపడుతున్నారనే కక్షతో కన్నతల్లిదండ్రులనే ఓ కుమార్తె అత్యంత కిరాతకంగా హతమార్చింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో చెప్పగా తల్లిదండ్రులు దశరథం, లక్ష్మి తీవ్రంగా వ్యతిరేకించి, ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దీంతో వారిని అడ్డు తొలగించుకోవాలని సురేఖ పథకం రచించింది.

పథకం ప్రకారం, ఈ నెల 24న సెలవుపై ఇంటికి వచ్చిన సురేఖ, ఆసుపత్రి నుండి తెచ్చిన అత్యవసర మత్తు మందును తల్లిదండ్రులకు ఇచ్చింది. ఒళ్లు నొప్పులకు మందు వేస్తున్నానని నమ్మించి, మోతాదుకు మించి ఇంజక్షన్ ఇవ్వడంతో వారు మృతి చెందారు. అనంతరం ఏమీ తెలియనట్లుగా నటించి, తన తండ్రి కుప్పకూలిపోయాడని, ఆ షాక్‌తో అమ్మకు గుండెపోటు వచ్చిందని అన్నకు ఫోన్ చేసి నమ్మబలికింది. సహజ మరణాలుగా చిత్రీకరించి పోలీసులను సైతం బురిడీ కొట్టించాలని చూసింది.

కానీ, ఘటనా స్థలంలో దొరికిన సిరంజీలు సురేఖ పాపాన్ని బయటపెట్టాయి. ఆ సిరంజీల లేబుల్స్ ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, సురేఖ తన వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. పోలీసుల విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించడంతో బుధవారం నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.