తెలంగాణలో నిరుద్యోగుల సమ్మె ఉధృతమౌతోంది. చిన్న సమస్య పెద్దగా మారి ఉద్యమ రూపం దాలుస్తోంది. ప్రభుత్వం భేషజాలకు పోవడంతో నిరుద్యోగులు ఏకమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ రోజురోజుకూ ఉధృతమౌతోంది. పోస్టుల సంఖ్య పెంచి పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పరీక్షలు పెట్టి తీరుతామంటున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లో వేలాదిగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్నే అమలు చేయమని కోరుతున్నామంటున్నారు నిరుద్యోగులు. ఎన్నికల సమయంలో పోస్టుల్ని పెంచి జంబో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా అధికారంలో వచ్చాక హామీల్ని నెరవేర్చకపోగా నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.నిన్న అర్ధరాత్రి కూడా నిరుద్యోగులు చిక్కడ్‌పల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.