Current Date: 04 Jul, 2024

బెంగళూరుని ముంచేస్తున్న తడబాటు.. కోహ్లీ ఫెయిలైతే అంతే


ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌ను బ్యాటింగ్ తడబాటు నిండా ముంచుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో బెంగళూరు వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించేలా కనిపించిన బెంగళూరు టీమ్ మిడిల్ ఓవర్లలో తడబడి 28 పరుగుల తేడాతో ఓడిపోయింది.

సీజన్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ నిలబడితే బెంగళూరు టీమ్ మెరుగైన స్కోరు చేస్తోంది.. ఒకవేళ కోహ్లీ ఆరంభంలోనే ఔటైతే ఇక ఆ టీమ్ ఓటమి దిశగా పరుగులు పెడుతోంది. లక్నోతో మ్యాచ్‌లో ఓవర్‌కి 10 పరుగుల చొప్పున పరుగులు చేసిన కోహ్లీ 4 ఓవర్లలోనే 40 పరుగుల మార్క్‌ని దాటించాడు. కానీ.. కోహ్లీ ఔట్ తర్వాత 3 పరుగుల వ్యవధిలో డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ వికెట్లను చేజార్చుకున్న బెంగళూరు ఒత్తిడిలో పడిపోయి చిత్తయ్యింది.

ఐపీఎల్ 17వ సీజన్ ఇప్పుడు నడుస్తోంది. కానీ.. బెంగళూరు టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. కనీసం ఈ ఏడాదైనా కప్ గెలుస్తుందనే ఆశ టీమ్ ప్రదర్శన చూస్తుంటే ఏ అభిమానికీ కలగడం లేదు. ఇలానే కొనసాగితే టీమ్ ప్లేఆఫ్స్‌కి కూడా చేరడం కష్టమే.