Current Date: 06 Jul, 2024

9 ఏళ్లుగా చెరగని సిరా గుర్తు.. నివ్వెరపోతున్న ఈసీ!


సాధారణంగా మనం ఓటేసినప్పుడు వేలిపై పెట్టే సిరా గుర్తు ఓ వారం రోజులు ఉంటుంది. కొందరికి వాళ్ల ఆహారపు అలవాట్లు, శుభ్రత కారణంగా నెల వరకూ కొద్దిపాటి మరక ఉండే అవకాశం ఉంది. కానీ.. కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం తొమ్మిదేళ్లయినా సిరా గుర్తు మాత్రం చెరగడం లేదు. దాంతో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆమెకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.

కేరళలోని షోరన్‌పూర్‌లోని గురువాయూరప్పన్‌ నగర్‌లో ఉండే ఈ 62 ఏళ్ల ఉష 2016 ఎన్నికల్లో ఓటేసింది. ఆ సందర్భంగా వేలిపై వేసిన సిరా గుర్తు 9 ఏళ్లుగా అలానే చెరగకుండా ఉండిపోయింది. కొన్ని రోజులకి చిరాకుపడిపోయిన ఉష ఆ గుర్తుని చెరిపేసేందుకు సబ్బులు, ద్రావణాలతో కడిగినా లాభం లేకపోయింది. ఆ తర్వాతి స్థానిక ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్తే వేలిపై గుర్తు చూసి నువ్వు ఇప్పటికే ఓటు వేశావ్.. దొంగ ఓటు వేయడానికి వచ్చావా? అని అధికారులు గద్దించారట.

అయితే.. అక్కడే పోలింగ్‌ బూత్‌లోని ఏజెంట్లు అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేయడానికి అనుమతించారు. పోలింగ్ అధికారులతో ప్రతిసారీ తిట్లు తినలేక.. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటే వేయకుండా ఇంటి దగ్గరే ఉండిపోయింది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ ఆమె ఓటు వేయడం డౌటే! చర్మ సంబంధిత వ్యాధి కారణంగా అలా సిరా గుర్తు ఉండిపోతోందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

Share