తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రి 41 అడుగుల నీటిమట్టం నమోదు కాగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి కరకట్టపైకి యాత్రికుల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇలాగే వరద ప్రవాహం పెరుగుతుంటే ఈ సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.