Current Date: 10 Aug, 2026

కాటు వేసిన పాముని మెడకు చుట్టుకొని ఆసుపత్రికి.. వైద్యులు, రోగులు పరుగులు

ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లా పఖాంజూర్‌ గ్రామానికి చెందిన దేవ్‌జిత్‌ సర్కార్‌ అనే యువకుడు విచిత్రమైన ఉదంతంతో వార్తల్లో నిలిచాడు. గత ఎనిమిదేళ్లుగా స్నేక్‌ క్యాచర్‌గా పనిచేస్తున్న దేవ్‌జిత్, నివాస ప్రాంతాల్లోకి వచ్చే పాములను పట్టుకుని అడవుల్లో వదిలేస్తుంటాడు. ఈ క్రమంలో ఇటీవల ఒక పామును పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అది అతనిపై దాడి చేసి కాటేసింది.
పాము కాటు వేసినప్పటికీ దేవ్‌జిత్‌ ఎంతమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో  వ్యవహరించాడు. తను కోలుకోవడానికి, అలాగే తక్షణ చికిత్స అందించడానికి వైద్యులకు సులభంగా ఉంటుందని భావించాడు. అందుకే, తనను కాటేసిన పాము విషపూరితమైనదా కాదా అని స్పష్టంగా తెలుసుకునేందుకు దాన్ని నేరుగా తన మెడకే చుట్టుకుని, బైక్‌పై ఏకంగా 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆసుపత్రికి బుసలుకొట్టే పాముతో వచ్చిన దేవ్‌జిత్‌ను చూసి వైద్యులతో పాటు రోగులు పరుగులు పెట్టారు. అనంతరం ఆ పామును పరిశీలించిన డాక్టర్‌ సంజీత్‌ వైష్ణవ్‌ అది విషపూరితమైనది కాదని ధ్రువీకరించారు. పామును ఇలా మెడలో వేసుకుని రావడం ఏమాత్రం సరికాదని, ఒకవేళ అది తీవ్ర విషపూరితమైతే పరిస్థితి ప్రాణాలకే ప్రమాదంగా మారేదని హెచ్చరించారు. దేవ్‌జిత్‌కు తగిన చికిత్స అందించామని, అతను త్వరగానే కోలుకున్నాడని వైద్యులు వెల్లడించారు.