ఏపీ శాసనసభకు ఉప సభాపతిగా రఘురామ కృష్ణంరాజు బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు సభాపతి స్థానంలో ఉండాలని ఆశపడ్డారు. ఆయన ఉండి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే.. తనను అధ్యక్ష స్థానంలో చూడాలని తన అభిమానులు కోరుకుంటున్నారంటూ అభిలాషను బహిరంగంగానే వెల్లడించారు. సభాపతి స్థానంలో ఉంటే.. ఆయన శత్రువుగా పరిగణించే.. గత అయిదేళ్లపాటు నిత్యం దూషిస్తూ గడిపిన జగన్మోహన్ రెడ్డిని ఆ స్థానం నుంచి అసెంబ్లీలో శాసించవచ్చునని బహుశా ఆశపడి ఉంటారు. ఇప్పుడు ఆయనకు పదవి దక్కింది గానీ ముచ్చట మాత్రం తీరలేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తప్ప శాసనసభకు రానని జగన్ తేల్చేయడంతో.. రఘురామ కృష్ణంరాజు అవకాశం మిస్ అయ్యిందని అనుకోవాలి. నిజానికి రఘురామ కృష్ణంరాజు సభాపతి స్థానాన్నే కోరుకున్నారు గానీ చివరికి ఉపసభాపతి స్థానం దక్కింది.