శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సోమవారం ఉద్రిక్తత తలెత్తింది. ధర్మవరం సబ్ జైలు వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేపీ లీడర్ హరీష్ వర్గీయుల మధ్య వాగ్వాదం, ఘర్షణ తలెత్తింది. సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కడకు చేరుకున్నారు.. అయితే ఇదే సమయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ శ్రేణులకు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.మాటామాటా పెరిగి ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ విషయం తెలిసి కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకున్నారు. దీంతో సబ్ జైలు వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వాహనాన్ని కూటమి నేతలు చుట్టుముట్టారు. కేతిరెడ్డి వాహనం డ్రైవర్ మీద కూడా దాడిచేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో ఓ కార్యకర్త మాజీ ఎమ్మెల్యే కారు బానెట్ పైకి కూడా ఎక్కారు. దీంతో తప్పించుకునే క్రమంలో కేతిరెడ్డి కారు డ్రైవర్.. అలాగే కారును ముందుకు పోనిచ్చారు. దీంతో ఆ కార్యకర్త రోడ్డుపై పడిపోయారు.ఈ ఘటన మీద ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు.