Current Date: 26 Jul, 2026

ఆలయానికి ఓ తండ్రి రూ.7 లక్షల విరాళం.. తిరిగిచ్చేయాలని కుమార్తెలు డిమాండ్

వేములవాడ రాజరాజేశ్వరస్వామి పరమ భక్తులైన ఒక వృద్ధ దంపతులు తమ జీవిత చరమాంకంలో స్వామివారిపై ఉన్న భక్తితో పెద్ద మనసు చాటుకున్నారు. తమ ఏడుగురు కుమార్తెల వివాహాలు పూర్తి చేసిన అనంతరం, తమ వద్ద ఉన్న నగదు మొత్తాన్ని స్వామివారి సేవకే వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రోజున రాజన్న ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 7,01,116 లను విరాళంగా సమర్పించారు. ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్‌లు వారి నుంచి విరాళం స్వీకరించి రసీదు అందజేశారు.

ఈ విరాళం విషయం తెలిసిన సదరు దంపతుల కుమార్తెల్లో కొందరు ఆలయ అధికారులను ఆశ్రయించడంతో కొత్త వివాదం చోటుచేసుకుంది. తమ తండ్రికి మతిస్థిమితం సరిగా లేదని, ఆ కారణంతోనే ఇంట్లోని డబ్బంతా గుడికి ఇచ్చేశారని కుమార్తెలు అధికారులకు తెలిపారు. తమ తల్లిదండ్రుల పోషణ, మున్ముందు అవసరాల కోసం ఆ సొమ్ము ఎంతైనా అవసరమని, కాబట్టి దయచేసి విరాళంగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని వారు ఆలయ సిబ్బందిని అర్ధించారు.

కుమార్తెల విజ్ఞప్తిపై ఆలయ అధికారులు స్పందిస్తూ తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. వృద్ధ దంపతుల పూర్తి అంగీకారం, అభీష్టం మేరకే విరాళం స్వీకరించామని, రాజసన్నిధికి ఒకసారి సమర్పించిన సొమ్మును తిరిగి ఇచ్చేందుకు నియమావళి ప్రకారం వీలుకాదని స్పష్టం చేశారు. దీంతో ఏమీ చేయలేక కుమార్తెలు నిరాశతో వెనుదిరిగారు.

Share