పొట్టకూటి కోసం రోడ్లపై పరుగులు తీసే ఒక సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన 56 ఏళ్ల వాంగ్ జిబింగ్, ఆ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన "లు క్సున్ లిటరరీ ప్రైజ్"ను కైవసం చేసుకున్నారు.
చిన్నతనంలోనే చదువుకు దూరమై భవన నిర్మాణ కార్మికుడిగా, వ్యర్థాల సేకరణదారుడిగా పలు పనులు చేసిన వాంగ్.. 2019లో కున్షాన్ నగరంలో డెలివరీ బాయ్‌గా స్థిరపడ్డారు. రోజుకు 12 నుండి 14 గంటలు పడే కష్టం, చవిచూసిన అవమానాలే ఆయనలోని కవిని మేల్కొలిపాయి.
2019లో ఒక కస్టమర్ తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో ఆర్డర్ ఆలస్యమై, పెనాల్టీ పడిన రాత్రి ఆయన రాసిన ‘మ్యాన్ ఇన్ ఎ హర్రీ’ అనే కవిత 2022లో 'వైబో' సోషల్ మీడియాలో వైరల్ అయి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.
200 మంది తోటి డెలివరీ రైడర్లను ఇంటర్వ్యూ చేసి, వారి జీవిత సవాళ్ల ఆధారంగా రాసిన ‘లో ఫ్లైట్’ కవితా సంపుటికి ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఇప్పటివరకు 6,000 పైగా కవితలు రాసిన వాంగ్‌కు ఈ అవార్డు కింద దాదాపు రూ.11.5 లక్షల నగదు బహుమతితో పాటు పుస్తకాల విక్రయాల ద్వారా లక్షల్లో రాయల్టీ ఆదాయం సమకూరుతోంది.
ఇంత పెద్ద పురస్కారం, ఆర్థిక గుర్తింపు వచ్చినా వాంగ్ జిబింగ్ తన వినమ్రతను చాటుకున్నారు. ఈ అవార్డు తన జీవితాన్ని మార్చలేదని, 60 ఏళ్లు వచ్చేవరకు డెలివరీ బాయ్‌గానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ పనే తనను శారీరకంగా దృఢంగా ఉంచుతుందని, సామాన్య శ్రమజీవుల కష్టాలకు దగ్గరగా ఉంచుతూ వారి గొంతుకగా కవిత్వం రాసేందుకు ప్రేరణనిస్తుందని ఆయన పేర్కొనడం విశేషం.