Current Date: 18 Nov, 2024

రామ్‌గోపాల్‌ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు

అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలన్న సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(ఆర్జీవీ) అభ్యర్థనను సోమవారం ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలని స్పష్టం చేసింది. పోలీసుల విచారణకు మరికొంత సమయమివ్వాలని ఆర్జీవీ విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. అభ్యర్థన పోలీసుల ముందు చేసుకోవాలని, కోర్టు ముందు కాదని వ్యాఖ్యానించింది. గతంలో వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్‌ వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో కేసును కొట్టివేయాలని వర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేసింది.

Share