Current Date: 14 Feb, 2026

ఏటీఎంలో క్యాష్ నింపేందుకు వెళ్తూ.. 60 లక్షలతో డ్రైవర్ పరార్!

హైదరాబాద్‌లోని గోపనపల్లిలో భారీ నగదు చోరీ ఘటన కలకలం రేపింది. ఏటీఎంల్లో నగదు నింపే సీఎంఎస్ (క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్) సంస్థకు చెందిన డ్రైవర్ అజిత్ కుమార్, సుమారు రూ. 60 లక్షల నగదుతో కూడిన వ్యాన్‌ను తీసుకొని పరారయ్యాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరిలోని సంస్థ కార్యాలయం నుంచి కస్టోడియన్లు రామకృష్ణ, అబ్దుల్ మాలిక్, సెక్యూరిటీ గార్డు పెరుమాల్‌తో కలిసి డ్రైవర్ అజిత్ వ్యాన్‌లో బయలుదేరారు. అత్తాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో ఏటీఎం డిపాజిట్లు ముగించుకుని సాయంత్రం 4:30 గంటలకు గోపనపల్లి చేరుకున్నారు. కస్టోడియన్లు ఏటీఎంలో నగదు నింపేందుకు లోపలికి వెళ్లగా, అదే సమయంలో సెక్యూరిటీ గార్డు కూడా పక్కకు వెళ్లడంతో డ్రైవర్ అజిత్ ఒంటరిగా ఉన్న వ్యాన్‌తో సహా ఉడాయించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వ్యాన్‌కు ఉన్న జీపీఎస్ సిస్టమ్ ద్వారా ట్రేస్ చేయగా, వాహనం తెల్లాపూర్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.