Current Date: 14 Feb, 2026

ఓటీటీ వెడ్డింగ్‌ డీల్‌కు నో చెప్పిన విజయ్ - రష్మిక!

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 2నే వీరి వివాహం జరుగుతుందని మొదట ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈనెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట ఏడడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని, మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. అయితే, వీరి పెళ్లికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా స్టార్ సెలబ్రిటీల వెడ్డింగ్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడుతుంటాయి. అలాగే ఈ జంట పెళ్లి వీడియో కోసం కూడా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కానీ, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మధుర జ్ఞాపకాలను వ్యాపారం చేయడం ఇష్టం లేక, విజయ్ - రష్మిక ఈ డీల్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార వంటి స్టార్ల వెడ్డింగ్ వీడియోల విషయంలో తలెత్తిన న్యాయపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కూడా వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ వివాహ వేడుకను కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అత్యంత ప్రైవేట్‌గా ఉంచుకోవాలని ఈ జంట భావిస్తోందట. రష్మిక ఇటీవల ఎయిర్‌పోర్టులో తన పెళ్లి తేదీ గురించి పాపరాజీలు అడిగిన ప్రశ్నకు సిగ్గుపడుతూ సమాధానం ఇవ్వడంతో, ఈనెల 26న పెళ్లి ఖాయమని తేలిపోయింది.