Current Date: 12 Feb, 2026

విశాఖలో కుక్క ప్రాణాలు కాపాడటానికి ఢిల్లీ నుంచి డాక్టర్ రాక!

విశాఖపట్నంలో మూగజీవంపై ఒక యజమాని చూపిన మమకారం, వైద్యుల అంకితభావం కలిపి ఒక శునకానికి పునర్జన్మను ప్రసాదించాయి. నగరానికి చెందిన ఒక వ్యక్తి తన మూడేళ్ల గోల్డెన్ రిట్రీవర్ పెంపుడు కుక్క అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో స్థానిక పెట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శ్రీధర్, ఎక్స్‌రేలో ఆ కుక్క పొట్టలో దారపు ఉండతో కూడిన సూది ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యారు. అయితే, ఆ సమయంలో కుక్కకు ప్లేట్లెట్స్ పడిపోవడంతో సాధారణ శస్త్రచికిత్స చేయడం ప్రాణసంకటంగా మారింది. తన ప్రాణ సమానమైన పెంపుడు కుక్కను ఎలాగైనా కాపాడాలని యజమాని కన్నీళ్లతో వేడుకోవడంతో, డాక్టర్ శ్రీధర్ వెంటనే ఢిల్లీలోని తన మిత్రుడు, వెటర్నరీ స్పెషలిస్ట్ డాక్టర్ విక్రమ్ మల్హోత్రను సంప్రదించారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న డాక్టర్ విక్రమ్, అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలతో విమానంలో ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకున్నారు. సమయం మించిపోతుండటంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్సకు సిద్ధమయ్యారు. ఎండోస్కోపీ విధానం ద్వారా శస్త్రచికిత్స ప్రారంభించిన డాక్టర్ విక్రమ్, సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి కుక్క పొట్టలో చిక్కుకున్న సూదిని, దారపు రీలును విజయవంతంగా బయటకు తీశారు. కోత లేకుండా జరిగిన ఈ ఆపరేషన్ ఫలించడంతో కుక్క ప్రాణాపాయం నుంచి గట్టెక్కింది. మరణం అంచుల దాకా వెళ్లిన తన పెంపుడు శునకం మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావడంతో యజమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.