Current Date: 17 Apr, 2026

మ్యాచ్ ఆడకుండా మెస్సీ నాటకం.. రూ.58 కోట్ల దావా

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీపై దాదాపు రూ.58 కోట్ల భారీ దావా నమోదైంది. గత ఏడాది జరిగిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడకపోవడం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఈవెంట్ నిర్వహణ సంస్థ 'విడ్ మ్యూజిక్ గ్రూప్' మెస్సీతో పాటు అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంపై కోర్టును ఆశ్రయించింది.వెనిజువెలా, ప్యూర్టో రికోలతో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌ల నిర్వహణ హక్కుల ఒప్పందం ప్రకారం, మెస్సీ ప్రతి మ్యాచ్‌లో కనీసం 30 నిమిషాల పాటు ఆడాల్సి ఉండగా, ఆయన నిబంధనలు పాటించలేదని ఆ సంస్థ ఆరోపించింది. నిరుడు అక్టోబరు 10న వెనిజువెలాతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ మైదానంలోకి దిగకుండా కేవలం గది నుంచే వీక్షించారు. అయితే, గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యారని భావించినా, సరిగ్గా మరుసటి రోజే తన క్లబ్ జట్టు 'ఇంటర్ మయామి' తరఫున అట్లాంటాతో జరిగిన మ్యాచ్‌లో పాల్గొని రెండు గోల్స్ సాధించడం వివాదానికి దారితీసింది. అంటే అర్జెంటీనా మ్యాచ్‌కు అందుబాటులో ఉండి కూడా ఆడలేదని, ఇది ఒప్పందాన్ని మోసం చేయడమేనని విడ్ గ్రూప్ తన దావాలో పేర్కొంది. ఈ న్యాయపరమైన చిక్కులపై మెస్సీ గానీ, అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధులు గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ప్యూర్టో రికోతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో మెస్సీ పాల్గొన్నప్పటికీ, వెనిజువెలా మ్యాచ్ విషయంలో జరిగిన ఉల్లంఘనపైనే సంస్థ ప్రధానంగా ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న క్రీడాకారుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.