Current Date: 17 Apr, 2026

ఐపీఎల్‌లో బెంగళూరు జోరు.. ఇంఫాక్ట్‌ ప్లేయర్‌గా అదరగొట్టిన కోహ్లీ

ఐపీఎల్-2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. హోమ్ గ్రౌండ్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచిన రజత్ సేన 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది .మొదట బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూను ఆర్సీబీ బౌలర్లు రసిఖ్ సలామ్ (4/24), భువనేశ్వర్ కుమార్ (3/27), హేజిల్‌వుడ్ (2/38) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 146 పరుగులకే కట్టడి చేశారు. లఖ్‌నవూ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుష్ బదోని (38) రాణించినప్పటికీ, ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ జట్టు 20 ఓవర్లలో ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే ఫిల్‌ సాల్ట్ (7) రూపంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన విరాట్ కోహ్లి ఆ లోటును భర్తీ చేశాడు. విరాట్ కోహ్లి (49; 34 బంతుల్లో) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, రజత్ పాటీదార్ (27), జితేశ్ శర్మ (23) మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా 12వ ఓవర్లో జితేశ్ వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో సమీకరణం సులువైపోయింది. చివర్లో టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంఛనాన్ని పూర్తి చేయడంతో 15.1 ఓవర్లలోనే ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించింది. లఖ్‌నవూ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసినప్పటికీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు.