మనం ఇళ్ల దగ్గర చూసే కోడికి ఒక విశిష్టమైన లక్షణం ఉంటుంది. అందరూ నమ్మరుగానీ.. కోడి పొదిగినప్పుడు తనకింద ఏ గుడ్లు ఉంచినా వాటిని పొదిగి పిల్లలు బయటికి వచ్చే వరకూ సంరక్షిస్తుంది. కోడిపిల్లలకి భిన్నంగా ఉన్నా.. వాటిని తన పిల్లలతోపాటే అపురూపంగా చూసుకుంటుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక కోడి నెమలి పిల్లలను కూడా తనతోపాటే తిప్పుకోవడం స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం 5 పిల్లలను పొదిగి తన వెంట తిప్పుకోవడం చూసినవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి పని మీద అడవికి వెళ్లగా.. అక్కడ కొన్ని గుడ్లు కనిపించాయి. వాటిని తీసుకొచ్చి ఇంట్లోని కోడి కిందనే కోడి గుడ్లతోపాటే పొదిగించేందుకు ఉంచాడు. దాదాపు మూడు వారాల తర్వాత ఆ గుడ్లు పొదిగి పిల్లలు వచ్చాయి. మొత్తం 5 గుడ్లు పొదిగి నెమలి పిల్లలు వచ్చాయి. కానీ వాటిని కూడా కోడి పిల్లలే అనుకున్నాడు. పిల్లలు క్రమంగా పెరుగుతన్న కొద్దీ కొన్నింట్లో మార్పులు గమనించాడు. వాటికి తలపై పింఛం రావడం, తోక పెరగడం మొదలైంది. అప్పుడు కానీ అవి నెమలి పిల్లలని, తాను నెమలి గుడ్లు తెచ్చి పొదిగించానని ఆ వ్యక్తికి అర్థం కాలేదు.
Share