Current Date: 18 Jul, 2026

49 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 న్యాయం సకాలంలో జరగకపోతే దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదనే చేదు నిజాన్ని నిరూపిస్తూ.. 1977 నాటి ఒక హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఇప్పటికే తన జీవిత ఖైదు శిక్షను అనుభవించిన తర్వాత, జూలై 15న సుప్రీంకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ విముక్తి కల్పించింది. ప్రాసిక్యూషన్ కథనంపై అనుమానాలు ఉన్నాయంటూ న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఇన్నేళ్లుగా చెప్తూ వస్తున్న ఆ వ్యక్తికి ఈ తీర్పుతో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఉపశమనం లభించింది. యూపీలోని గోండా జిల్లా కాంచన్‌పూర్ గ్రామంలో నిందితులు ఆయుధాలతో బాధితుడిని అడ్డుకుని, దాడి చేసి చంపేశారని ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 1981లో ట్రయల్ కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించగా, 2011లో అలహాబాద్ హైకోర్టు కూడా ఆ శిక్షను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. ప్రస్తుతం బతికి ఉన్న ముగ్గురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ సుదీర్ఘ కాలంలో మిగిలిన ఇద్దరు నిందితులు మరణించారు. బతికున్న ముగ్గురిలో రాజ్ బక్స్, సుబేదార్ అనే ఇద్దరికి 2013లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న హీరా లాల్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో అతను జైల్లోనే శిక్ష అనుభవించాల్సి వచ్చింది. సుమారు మూడేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతని శిక్షను తగ్గించడంతో  అతను జైలు నుండి బయటకు వచ్చాడు. నేరం జరిగిన 49 ఏళ్ల తర్వాత, శిక్షాకాలం మొత్తం ముగిసిపోయిన తదనంతరం సుప్రీంకోర్టు అతనికి క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం.