ప్రభుత్వం ఇచ్చే ఉచితాల కోసం ఆశించకుండా సొంత సేధ్యంతో లక్షలకు లక్షలు సంపాదించుకోవచ్చని ఈ ఆదివాసీ యువతీయువకులు నిరూపించారు. నాలుగు గ్రామాలకు చెందిన 94 కుటుంబీకులు 110 ఎకరాల్లో జీడిమామిడి పంట ద్వారా ఈ ఏడాది ఒక్క నెలలోనే అక్షరాలా 76 లక్షల 46 వేల 960 రూపాయలను సంపాదించుకున్నారు. దేశమంతా తమ వైపు చూడాలనే తపనతో కొత్త శకానికి నాంది పలికారు ఈ ఆదివాసీలు. ఈ విజయం ఎక్కడిదోకాదు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణలోవ ప్రాంతంలో తరతరాలుగా బానిస బతుకులు సాగిస్తున్న ఆదివాసీలది. వీరిని చైతన్యవంతుల్ని చేసి రుణవిముక్తుల్ని చేసిన ఘనత ఆదివాసీల నాయకుడు అజయ్ కుమార్‌ది.
2023 జూన్‌లో చేపట్టిన రుణ విమోచన ఉద్యమం వల్ల 2024, మే 15వ తేదీ నాటికి చెట్లూ, చేమలూ ఆదివాసీల సొంతమయ్యాయి. నాలుగు గ్రామాలకు చెందిన 110 ఎకరాలు జీడిమామిడి తోటలను ఆదివాసీ రైతులు తిరిగి స్వాధీనం చేసుకుని స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్నారు. అయితే ఈ తోటలపై పెట్టుబడిని, ఇతర ఖర్చుల్ని తగ్గించుకోడానికి ‘సహాయాలు’ అనే సంప్రదాయ పద్దతిని పునరుద్ధరించారు. రసాయనిక విష ఎరువుల్ని, రసాయనికి పురుగు మందుల్ని దగ్గరకు రానివ్వలేదు. ‘చెట్టు ఎంత ఇస్తే అంతే’ అనే సూత్రాన్ని పాటించి ముందుకు నడిచారు. అలాగే చెట్లకు కాసిన జీడిపిక్కల అమ్మకం విషయంలో కూడా దళారుల్ని దూరంగా పెట్టారు. సరుకును తూకం వేయడానికి సొంత కాటాను కూడా ఆదివాసీలే సిద్ధం చేసుకున్నారు. జీడిపిక్కలు అమ్మకానికి నేరుగా ప్రాసెసింగ్ కంపెనీలతోనే మాట్లాడుకుని వారికి సరఫరా చేశారు. 2024, ఏప్రిల్ 16 నుంచి మే 15వ తేదీ వరకూ అంటే.. కేవలం నెల రోజుల్లో 902 బస్తాల జీడిపిక్కల్ని కంపెనీకి అందించారు. ఒక్కో బస్తాకు 80 కేజీల చొప్పున మొత్తం 72,160 కేజీల జీడిపిక్కల్ని 76,46,960 రూపాయలకు విక్రయించి ఈ ప్రపంచాన్నే జయించినంత ఆనందాన్ని పొందారు. అంతేకాదు తాము జీడిపిక్కల్ని కంపెనీకి సరఫరా చేసిన రెండు, మూడు రోజుల్లోనే ఆదివాసీల చేతికి సొమ్ము అందేసింది. ఈ ఆదివాసీ రైతులకు చెందిన 94 కుటుంబాలు ‘గిరి సిరి రైతు ఉత్పత్తిదారుల సంస్థలో వంద రూపాయల సభ్యత్వాన్ని తీసుకొని, వెయ్యి రూపాయల చొప్పున షేర్ ధనాన్ని చెల్లించారు. ఈ సంస్థ ద్వారా కార్యకలాపాలను నిర్వహించడానికి ఆదివాసీ రైతులు నిర్ణయించారు. గ్రామంలోని చదువుకున్న ఆదివాసీ యువతీయువకులు ఈ మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహించి విజయ దుందుభిని మోగించారు. ఈ అద్భుత విజయ గాధను విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ ఆర్‌బిఐ గవర్నర్ శ్రీశక్తి కంఠదాస్‌కు ఒక లేఖ రాస్తూ నాబార్డ్ లాంటి సంస్థలు ఈ ఆదివాసీల విజయాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని ప్రపంచానికి అందివ్వాలని కోరారు.