ట్విట్టర్‌లో మెగా బ్రదర్ నాగబాబు చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కానీ అతను వేసే ట్వీట్స్ కొన్ని పవన్ కళ్యాణ్‌తో పాటు.. జనసేనని కూడా ఇరుకునపెట్టేలా ఉంటాయి. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒక ట్వీట్ వేశారు నాగబాబు. “వర్షాలు పడి తూములు తెగిపోయి, చెరువులు, నాలాలు ఉప్పొంగి అపార్ట్ మెంట్స్‌లోకి కూడా నీళ్లు రావడం, కొంతమంది ప్రాణాలు పోవడం చాలా బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువుల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే. ఇప్పటికైనా అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్. మన ముఖ్యమంత్రిని అందరం మెచ్చుకుందాం” అని నాగబాబు ట్వీట్ చేశారు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ ఈ ట్వీట్ మాత్రం చాలా రాంగ్ టైమ్‌లో వేశారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడకి సమీపంలోని కరకట్టపై ఉంటున్నసీఎం చంద్రబాబు నివాసం సమీపంలోకి వరద నీరు వచ్చేసింది. ఇదే ట్వీట్‌ను కరకట్ట నిర్మాణాలకు సంబంధించి వేయగలవా అంటూ వైసీపీ, నెటిజన్ల నుంచి ప్రతిఘటన ఎదురైంది. వరద నీటితో నిండిపోయిన అమరావతి ఫొటోలు కూడా పెట్టి కౌంటర్స్ వేస్తున్నారు. దాంతో ఇప్పుడు టీడీపీతో పాటు జనసేన కూడా ఇరుకునపడిపోయింది.
Share