వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జునను మళ్లీ ధర్మవరానికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తూ శనివారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని మంత్రి కార్యాలయంలో నిర్వహిస్తున్న పురపాలక అధికారుల సమీక్ష సమావేశానికి కమిషనర్ హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి పెద్దఎత్తున చేరుకొని నిరసనకు దిగారు. కమిషనర్‌ను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. వందలమంది ఆందోళన చేపట్టడంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. కమిషనర్ మల్లికార్జునను మంత్రి కార్యాలయం నుంచి పోలీసు వాహనంలో తరలించారు. తర్వాత మంత్రి కిందకు రావడంతో ఒక్కసారిగా తెదేపా టీడీపీ కార్యకర్తలు ఆయన్ను చుట్టుముట్టారు. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ కార్యకర్తలను పక్కకు పంపడంతో మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Share