కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనం కొల్లేరు నీటిలో కూరుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన నాయకులు కామినేని కిందకు దింపి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బుడమేరు ప్రవాహం కొల్లేరులో ఉధృతిగా కలుస్తోంది. దీంతో గుడివాడ, కైకలూరు, కలిదిండి ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు భారీగా చేరింది. వీటిని మూడు రోజులుగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు పరిశీలిస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సోమవారం కైకలూరు మండలం పందిరిపల్లిగూడేనికి వెళ్తుండగా రోడ్డుపై ప్రవహిస్తున్న కొల్లేరు వరదలో ఆయన వాహనం చిక్కుకుంది. వాహనం బురదలో కూరుకుపోవడంతో కామినేనిని భద్రతా సిబ్బంది తాళ్ల సాయంతో బయటకు తీసుకు వెళ్లారు.