భవన నిర్మాణానికి గాను చదరపు అడుగు ఒక్కింటికి 35వేల రూపాయలు ఖర్చు కావడం ఎక్కడైనా చూశారా? అంబానీ, అదానీల భవనాలకు కూడా అంత ఖర్చు పెట్టడం చూసివుండరు. కానీ రుషికొండ ప్యాలస్ నిర్మాణానికి జగన్ పెట్టిన ఖర్చు చదరపు అడుక్కి అక్షరాలా 35వేల రూపాయలు. మొత్తం భవన నిర్మాణ ప్రాజెక్టు ఖరీదు 680 కోట్ల రూపాయలు. మొత్తం 19,968 చదరపు మీటర్లు లేదా 2,14,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్యాలస్ నిర్మితమయింది. రుషికొండపై పచ్చని చెట్లను నరికి బోడికొండగా చేసిన వైసీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం వచ్చాక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ భవనంలోకి అడుగుపెట్టి ప్యాలస్‌లో విషయాలను బయటపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు పది ఎకరాల్లో ఈ భవనం నిర్మితం కాగా భవిష్యత్‌లో మరో 51 ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతాయని అప్పట్లో జగన్ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.