తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని పది ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ‘ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్(ఐఎస్ ఎఫ్) ’, టెక్సప్ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్ రన్ వే’ సంస్థల ప్రతినిధులతో సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా స్టార్టప్ లను ప్రోత్సహించే ఈ రెండు సంస్థలకు అమెరికా లోని యూనిర్సిటీ ఆఫ్ టెక్సస్, యూకెలోని లండన్ బిజినెస్ స్కూల్ లాంటి పది ప్రఖ్యాత స్కిల్ యూనివర్సిటీలతో శిక్షణకు సంబంధించిన ఒప్పందాలున్నాయి. సెప్టెంబర్ 26-28 ల మధ్య నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ సదస్సు లో ఈ యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని శ్రీధర్ బాబు తెలిపారు. ఐఎస్ ఎఫ్ ఛైర్మన్ డా. జె.ఎ.చౌదరి, డైరెక్టర్ శేషాద్రి వంగల ఆధ్వర్యంలో టెక్సస్ రిచర్డ్ సన్ సిటీ, ఫ్రిస్కో సిటీల ప్రతినిధులు తనను కలిసి తెలంగాణాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ’లో సంయుక్తంగా కార్యకలాపాలు చేపట్టడానికి ఆసక్తి వ్యక్తంచేసారని ఆయన వివరించారు.