అకాల వర్షాల తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో పగటిపూట బయట తిరగాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ఏపీలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాళ్టి నుంచి వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది . ఇవాళ 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు 195 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 147మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.