రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డేటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్‌లో జరుగుతున్న డేటా ఇంటిగ్రేషన్ పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌లు ఆర్టీజీఎస్ ద్వారా చేపడుతున్న డేటా ఇంటిగ్రేషన్ పనుల ప్రగతి గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియల్ టైమ్ డేటా అందించే ఏకైక వనరుగా పనిచేయాలని అన్నారు. అన్ని విభాగాల్లోని డేటాను ఒక వేదికపైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డేటా ద్వారా విశ్లేషించాలన్నారు. ఆర్టీజీఎస్ అనేది ప్రభుత్వానికి ఒక సదుపాయ సాధనంగా, అన్ని వేళలా సహాయకారిగా పనిచేయాలని సూచించారు.