Current Date: 30 Jun, 2024

పెంపుడు కుక్క కరిచి యువకుడి మృతి

భీమునిపట్నం శివారు ఎగువుపేటలో దారుణం చోటు చేసుకుంది. సరదా కోసం పెంచుకున్న కుక్కే ఆయన్ను కరవడంతో తండ్రీ కొడుకు మృతి చెందిన సంఘటనతో స్థానికంగా కలిచివేసింది. ఆ కుక్క కరిచిందని భీమిలి ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకున్నా ఫలితం లేకుండా పోయింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని మత్స్యకార కుటుంబానికి చెందిన అల్లిపల్లి.నర్సింగరావు (59) తన భార్య అల్లిపల్లి చంద్రావతి (57), కుమారుడు భార్గవ్‌(27)తో కలిసి నివాసముంటున్నారు. సరదా కోసం ఓ కుక్కను పెంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఆ కుక్క ఇంట్లో వారందర్నీ కరిచేసింది. ఈ క్రమంలో రెండ్రోజుల వ్యవధిలోనే కుక్క కూడా మృతి చెందింది. దీంతో వారంతా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇదిలా ఉంటే నర్సింగరావు పక్షవాతంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఆయన్ను భార్గవ్‌ కేజీహెచ్‌కు తీసుకు వెళ్తున్న సమయంలో భార్గవ్‌ మృతి చెందాడు. వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకోకపోవడం వల్లే ఆయన మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. అయితే మంగళవారం కుటుంబ యజమాని నర్సింగరావు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. చంద్రావతి  ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాన్ని భీమిలి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కల్యాణ్‌ చక్రవర్తి పరామర్శించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగు రోజుల క్రితం మృతి చెందిన భార్గవ్‌, తల్లి చంద్రావతి తమ ఆస్పత్రిలోనే వ్యాక్సిన్‌ వేయించుకున్నారని, తండ్రి నరసింగరావు మాత్రం పక్షవాతం వల్లే మృతి చెందినట్టు తెలుస్తోందన్నారు. రెండో డోస్‌ వేయించుకోకపోవడం వల్లే భార్గవ్‌ మృతి చెందాడని తేల్చారు.

Share