Current Date: 06 Jul, 2024

దేశీయ సోషల్‌ మీడియా ‘కూ’ యాప్‌ నిలిపివేత

దేశీయ సోషల్‌ మీడియా యాప్‌  ‘కూ’  మూత పడింది . ఎక్స్‌ (ట్విటర్‌కు)కు ప్రత్యామ్నాయంగా మారుతుందని అనిపించిన ఈ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ తన కార్యకలాపాలను తాజాగా నిలిపివేసింది. సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్‌లో బుధవారం పోస్ట్‌ చేశారు. డైలీ హంట్‌ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా అవేవీ సఫలీకృతం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కూ యాప్‌ 2019లో ప్రారంభమైంది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్‌ బిడవట్కా కలిసి దీన్ని ప్రారంభించారు. రాధాకృష్ణ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్‌ విషయంలో ట్విటర్‌తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు కూ యాప్‌ బాగా  ప్రాచుర్యంలోకి వచ్చింది.  అనతి కాలంలో యూజర్‌ బేస్‌ భారీగా పెరిగింది. తర్వాత నైజీరియా, బ్రెజిల్‌ వంటి దేశాలకూ తన కార్యకలాపాలను విస్తరించింది. తర్వాతి కాలంలో సంస్థకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది.

Share