Current Date: 27 Nov, 2024

చంద్రబాబుపై నోరుజారిన వైసీపీ అధికార ప్రతినిధి అరెస్ట్

ఏపీలో మళ్లీ అరెస్ట్‌ల పర్వం మొదలైంది. వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి నాగార్జున్ యాదవ్ వస్తుండగాకుప్పంలో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పలుమార్లు నాగార్జున్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇటీవల సాక్షి టీవీలో ఓ డిబేట్‌లో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా నాగార్జున్ యాదవ్ నీచంగా మాట్లాడారు. దాంతో ఇటు టీడీపీ, అటు కాంగ్రెస్ నేతలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. నాగార్జున యాదవ్‌పై పాత కేసుకు సంబంధించి గతవారం హైకోర్టులో కూడా విచారణ జరిగింది. నాగార్జునపై నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని కుప్పం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఓ టీవీ డిబేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కె వరుణ్‌కుమార్‌ నాగార్జున యాదవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నాగార్జునయాదవ్‌పై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.. వెంటనే నాగార్జున యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు. 

Share