Current Date: 29 Sep, 2024

ముగిసిన పారా ఒలింపిక్స్.. 29 పతకాలతో సగర్వంగా భారత్‌కి అథ్లెట్స్

పారాలింపిక్స్‌ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో భారత అథ్లెట్స్ అబ్బురపరిచారు. ఆదివారం ముగిసిన పారిస్‌ పారాలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ 29 పతకాలతో 18వ స్థానంలో నిలిచింది. గత టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి 19 పతకాలతో 24వ స్థానంలో నిలిచింది. శనివారం భారత్‌కు ఒక స్వర్ణ పతకం, ఒక కాంస్య పతకం లభించింది.భారత్‌ సాధించిన 29 పతకాల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. చైనా 220 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. చైనా క్రీడాకారులు 94 స్వర్ణాలు, 76 రజతాలు, 50 కాంస్య పతకాలు గెల్చుకున్నారు. భారత్‌కు రజతం ఖరారైన చోట అనూహ్య పరిస్థితుల్లో స్వర్ణ పతకం లభించింది. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌41 కేటగిరీలో భారత అథ్లెట్‌ నవ్‌దీప్‌ సింగ్‌ ఈటెను 47.32 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో రజత పతకాన్ని దక్కించుకున్నాడు.ఇరాన్‌ అథ్లెట్‌ సాదెగ్‌ బీట్‌ సాయె జావెలిన్‌ను 47.64 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. అయితే స్వర్ణం ఖరారయ్యాక సాదెగ్‌ నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన పతాకాన్ని ప్రదర్శించాడు. అంతకుముందు త్రో విసిరాక తలను చేతితో ఖండిస్తున్నట్లుగా సాదెగ్‌ సంకేతం ఇచ్చాడు. అతనికి హెచ్చరికగా ఎల్లో కార్డును ప్రదర్శించారు. మతపరమైన పతాకాన్ని ప్రదర్శించడంతో సాదెగ్‌కు రెండో ఎల్లో కార్డు చూపెట్టారు. దాంతో అతను డిస్‌క్వాలిఫై అయ్యాడు. సాదెగ్‌ ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అతను సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన నవ్‌దీప్‌కు స్వర్ణ పతకాన్ని ప్రదానం చేశారు.

Share