Current Date: 25 Nov, 2024

ఐపీఎల్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్.. 261 సరిపోలేదు

ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ అయ్యింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్ అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఏకంగా 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసింది. అది కూడా 8 బంతులు మిగిలి ఉండగానే.. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం గమనార్హం. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మ్యాచ్‌లో ఏకంగా 37 ఫోర్లు... 42 సిక్సర్లు అంటే ఇరు జట్లు కలిపి బౌండరీల రూపంలో వచ్చిన పరుగులే 400 అన్నమాట.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ టీమ్ 18.4 ఓవర్లలోనే 262 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 108 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్ అనే కుర్రాడు 28 బంతుల్లోనే 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 68 రన్స్ చేశాడు. దాంతో కోల్‌కతా బౌలర్లు తలలు పట్టుకున్నారు.

సీజన్‌లో 8వ మ్యాచ్‌ ఆడిన కోల్‌కతా మూడో మ్యాచ్‌లో ఓడినప్పటికీ రెండో స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం మూడో విజయంతో 8వ స్థానంతో సరిపెట్టుకుంది.