Current Date: 04 Jul, 2024

కార్గిల్‌ యుద్ధం పాపం మాదే . 25 ఏళ్ల తర్వాత మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌, న్యూస్‌లీడర్‌, మే 29 : కార్గిల్‌ యుద్ధం జరిగిన 25 ఏళ్ల తరువాత పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్గిల్‌ యుద్ధం తాలూకు పాపం తమదేనని కుండబద్ధలు కొట్టారు. 1999లో లాహోర్‌ వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ మధ్య శాంతి ఒప్పందంపై నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, తాను కూడా సంతకాలు చేశామని గుర్తు చేశారు. అయినా, తాము ‘లాహోర్‌ డిక్లరేషన్‌’ ఉల్లంఘించామని నవాజ్‌ షరీఫ్‌ స్పష్టం చేశారు. అందుకు ప్రధాన కారణం అప్పటి పాక్‌ ఆర్మీకి ఫోర్‌ స్టార్‌ జనరల్‌గా ఉన్న పర్వేజ్‌ ముషారఫ్‌ అని ఆరోపించారు.
లద్దాఖ్‌ మీదుగా పాక్‌ ఆర్మీని కార్గిల్‌లోకి రహస్యంగా చొరబడాలని ఆయనే సూచించారని తెలిపారు. అయితే, భారత్‌ ముందుగానే అప్రమత్తమైన వీరోచితంగా యుద్ధం చేసి పాక్‌పై విజయం సాధించిందన్నారు. పాకిస్తాన్‌ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని, అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ పాక్‌ అణు పరీక్ష ఆపేస్తే.. 5 బిలియన్‌ డాలర్లను ఇస్తానని ఆఫర్‌ చేశాడని గుర్తు చేశారు. కానీ, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని తాను ప్రధానిగా అమెరికా ఇచ్చిన అఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు.