ఈ నెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నివాసంలో శుక్రవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా టీడీపీ ఉన్న నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామని తెలిపారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామని, విజన్ డాక్యుమెంట్‌కు కేంద్ర సహకారం అవసరమని చెప్పారు. మరో వైపు.. జనసేన ఎంపీలతో తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్లో చర్చించాల్సిన విషయాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు తదితర అంశాలపై పవన్ ఎంపీలకు సూచనలు చేశారు.