ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సింహాచలం శ్రీవరహాలక్ష్మీ నరసింహ స్వామికి ఈనెల 22న రెండో విడత చందన సమర్పణ ఆలయ వర్గాలు సర్వం సిద్ధం చేస్తు న్నాయి. గత మూడు రోజుల్లో 112 కేజీలు పచ్చి చందనాన్ని ఆలయ సిబ్బంది అరగ దీశారు. తొలిరోజు 40 కేజీలు, రెండో రోజు 37 కేజీలు, సోమవారం మరో 35 కేజీలు చందనం సిద్దం చేశారు. ఈ రోజు మంగళవారంతో రెండో విడతకు అవసర మైన 125 కేజీలు చందనం పూర్తిస్థాయిలో సిద్దం కానుంది. ఇందులో సుగంద ద్రవ్యాలు మిలితం చేసి ఆలయ పద్మ నిధిలో భద్రపరచనున్నారు. ఆలయ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చక పరివారం చందనం సమర్పణ కు ఏర్పాట్లు చేస్తున్నారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఆరోజు పెద్ద ఎత్తున భక్తులు సింహగిరికి తరలిరానుండటంతో పండుగ వాతావరణం నెలకొంది.