Current Date: 25 Nov, 2024

బౌలర్లని ఏడిపిస్తున్న ఐపీఎల్ 2024.. బ్యాటర్లు హ్యాపీ!

ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. క్యూరేటర్లు బ్యాటింగ్ పిచ్‌లు తయారుచేస్తుండటంతో.. బ్యాటర్లు ఆడుతూ పాడుతూ ఫోర్లు, సిక్సర్లు బాదేస్తున్నారు. దాంతో బౌలర్లకి బౌలర్లకి కన్నీళ్లు తప్పడం లేదు. ఎంతలా అంటే వారం వ్యవధిలోనే రెండు జట్లు 270కిపైగా స్కోర్లను నమోదు చేశాయి. ఐపీఎల్ 17 ఏళ్ల చరిత్రలో ఓ రెండు జట్లు ఒకే సీజన్‌లో 250పైచిలుకు స్కోర్లు నమోదు చేయడం ఇదే తొలిసారి.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆ జట్టులో సునీల్ నరైన్, రఘువంశీ, ఆండ్రీ రసెల్, రింకు సింగ్ సిక్సర్ల మోత మోగించేశారు. మొత్తంగా కోల్‌కతా టీమ్ 18 సిక్సర్లు, 22 ఫోర్లు బాదేసింది. దాంతో ఢిల్లీ బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ టీమ్ 166 పరుగులకే ఆలౌటైంది.

నిజానికి ఐపీఎల్‌ వేలంలో బ్యాటర్ల కంటే బౌలర్లకే అత్యధిక ధరని ఫ్రాంఛైజీలు చెల్లించాయి. కానీ.. బ్యాట్, బాల్‌కి మధ్య బ్యాలెన్స్ లేకపోవడంతో.. కోట్ల ధరకి బౌలర్లు న్యాయం చేయలేకపోతున్నారు. ఇది వారి బౌలింగ్‌పై ప్రభావం చూపుతోంది. ఇదే పంథా కొనసాగితే సీజన్‌లో ఆటపై ప్రేక్షకులకి ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. అయితే.. మ్యాచ్‌లు జరిగేకొద్దీ పిచ్‌లు బౌలింగ్‌కు అనుకూలంగా మారతాయని క్యూరేటర్లు చెప్తున్నారు.