తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన జ్యోతిష్కుడు రామకృష్ణన్‌కు స్థానిక పోక్సో కోర్టు 200 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2021లో చదువులో వెనుకబడిన తన 14, 17 ఏళ్ల కుమార్తెలకు 'పరిహారం' చేయిస్తానన్న నెపంతో నిందితుడు వారిని గదిలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలికలు అనారోగ్యానికి గురవ్వడంతో, తల్లిదండ్రులు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆ బాలికలకు లైంగిక సంక్రమణ వ్యాధులు సోకినట్లు నిర్ధారణ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు తిరుప్పత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు తన దైవ కార్యాల పేరుతో బాలికల జీవితాలను చిన్నాభిన్నం చేసినట్లు స్పష్టమైంది. శివగంగై పోక్సో కోర్టు న్యాయమూర్తి ఈ కేసును అత్యంత తీవ్రమైనదిగా పరిగణించి, నిందితుడికి 200 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధించారు. అలాగే, బాధితులైన ఇద్దరు బాలికలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.