Current Date: 26 Jun, 2026

ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో.. భారత్ సెమీస్ ఆశలు సజీవం

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి నుండి కోలుకుంటూ, మాంచెస్టర్‌లో జరిగిన గ్రూప్‌-1 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ బృందం 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో విజయం కాగా, సెమీస్‌ రేసులో నిలవాలంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.b ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను భారత స్పిన్నర్లు రాధ యాదవ్‌, శ్రీచరణి కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 136/8 పరుగులకే పరిమితం చేశారు. భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్‌లు చేజార్చడం, ఏడు వైడ్‌లు వేసినప్పటికీ బంగ్లాదేశ్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. బంగ్లా బ్యాటర్లలో జయేరియా (33) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షెఫాలి వర్మ (34 బంతుల్లో 53; 8×4, 1×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేసింది. స్మృతి (8) త్వరగానే ఔటైనా, షెఫాలి జోరుతో భారత్‌ ఒక దశలో 73/1తో అలవోకగా గెలిచేలా కనిపించింది. ఆ తర్వాత యాస్తిక (23), రిచా (10), జెమీమా (26)లు వరుసగా ఔట్ కావడంతో కాస్త తడబడినప్పటికీ, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (13 నాటౌట్‌), దీప్తి శర్మ (5 నాటౌట్‌) కలిసి మరో 19 బంతులు మిగిలి ఉండగానే లాంఛనాన్ని పూర్తి చేశారు.

Share