సమంత కథానాయికగా నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో పాల్గొన్న సమంత, తన అభిమానులకు ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. తాను గర్భవతినని అధికారికంగా ప్రకటించి, సినిమా విజయంతో పాటు వ్యక్తిగత జీవితంలోని ఈ మధుర క్షణాన్ని పంచుకుంటూ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సమంత ప్రెగ్నెన్సీ గురించిన రూమర్స్ సోషల్ మీడియాలో బాగా వినిపించాయి. ముఖ్యంగా సినిమా ప్రమోషన్లలో ఆమె కనిపించిన తీరుతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పుడు సమంత స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలకు మరోసారి చిన్న విరామం ఇస్తున్నానని, ఇప్పటి నుంచి మెటర్నిటీ లీవ్ తీసుకోబోతున్నానని సామ్ సంతోషంగా వెల్లడించింది. సమంత గతేడాది డిసెంబర్లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత ప్రెగ్నెన్సీ వార్త బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.