మహారాష్ట్రలో బాల్యవివాహాలను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఒక వినూత్న నిబంధనను తీసుకురావాలని యోచిస్తోంది. ఇకపై వివాహ ఆహ్వాన పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను తప్పనిసరిగా ముద్రించేలా సరికొత్త చట్టాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే అసెంబ్లీలో వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో మహారాష్ట్రలో బాల్యవివాహాల రేటును 10 శాతం కంటే కిందకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగులు వేస్తోంది. పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించే ఈ విధానం ఇప్పటికే రాజస్థాన్‌లో విజయవంతంగా అమల్లో ఉంది. ఈ విధానం అక్కడ ఎలా పనిచేస్తుందో సమగ్రంగా అధ్యయనం చేసేందుకు గానూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. ఈ కొత్త నిబంధనను మహారాష్ట్రలోనూ పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖలతో సంప్రదింపులు జరిపి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి అదితి తట్కరే స్పష్టం చేశారు. ఈ విధానం గనుక అమల్లోకి వస్తే బాల్యవివాహాల నియంత్రణలో ఒక కీలక మార్పు వచ్చే అవకాశం ఉంది.