నర్సీపట్నం అటవీ రేంజ్ పరిధిలో వన్యప్రాణాల వేట ఆగటం లేదు. అటవీశాఖ అధికారులు దాడులు చేస్తున్నా ,కేసులు పెడుతున్నా, వేటగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. వన్యప్రాణుల మాంసానికి గిరాకీ ఉండడంతో రాత్రి సమయాల్లో కొండ కోనల్లో వేట జరుగుతూనే ఉంది. అడవి పందులు, కొండ గొర్రెలు, అడవి కోళ్ళు, ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. కరెంటు వైర్లు, వేటకుక్కలు,కొన్ని చోట్ల నాటు తుపాకులు వినియోగించి వన్యప్రాణులను వేటా డుతున్నారు. మాంసం విక్రయిస్తున్నారు. తాజాగా నర్సీపట్నం అటవీ రేంజ్ పరిధిలోని రాచపల్లి పంచాయతీ శివారు యరకన్నపాలెం గ్రామo లో వన్యప్రాణి కణుజు ను వేటాడారు. శనివారం ఉదయం కణుజు మాంసం విక్రయిస్తుండగా సమాచారం తెలుసుకున్న నర్సీపట్నం రేంజ్ ఆఫీసర్ లక్ష్మీ నర్సు తన సిబ్బందితో దాడి జరిపారు. 20 కిలోల మాంసంతో పాటు,ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరి కొందరు పరారయ్యారు. పారిపోయిన వారికోసం గాలిస్తున్నామని నర్సీపట్నం రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనర్సు తెలియజేశారు. వన్యప్రాణులను వేటాడటం తీవ్రమైన నేరమన్నారు. వేటగాళ్లు వన్యప్రాణులను వధిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
Share