వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిననీట్ పరీక్షలో పేపర్ లీకేజీ, అవకతవకలు జరిగాయంటూ వస్తోన్న వార్తలతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో వీటిని నిర్వహిస్తోన్న జాతీయ పరీక్ష మండలి పై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ‘‘పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా.. న్యాయంగా వ్యవహరించాలి. ఏదైనా తప్పిదం జరిగితే.. తప్పు జరిగిందని అంగీకరించాలి. ఈ చర్యలు తీసుకోనున్నాం అని వివరించాలి. కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుంది’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. తదుపరి విచారణను జులై 8న చేపడతామని తెలిపింది.